Saturday, March 7, 2020

మహిళాదినోత్సవం (ప్రత్యేక అవధానం)

అష్టావధానం (ముప్పై ఏడవ రోజు)
08-03-2019, శుక్రవారం.

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ మహిళలే పాల్గొన్న ప్రత్యేక అవధానం


అవధాని శ్రీ గౌరీభట్ల బాలముకుందశర్మా,
గోలోకాశ్రమము గారు
నిర్వహణ: గోగులపాటి కృష్ణమోహన్

సమన్వయ కర్త : సరస్వతీ రామశర్మ

పృచ్ఛకులు

చందోభాషణం :సరస్వతీ రామశర్మ

నిషిద్ధాక్షరి : జ్ఞానప్రసూనమ్మగారు

న్యస్తాక్షరి : డా.చీదెళ్ళ సీతాలక్ష్మి గారు

సమస్య : చిగురాల పద్మగారు

దత్తపది :కొల్లూరు పద్మజ గారు

ఆశువు : సరస్వతి రామశర్మ

వర్ణన : లక్ష్మీ మదన్ గారు...

అంత్యాక్షరి  : దోర్భల బాలసుజాత గారు

దృశ్యం : గుమ్మన్నగారి బాలసరస్వతి గారు

ఆకాశ పురాణం : రంగరాజు పద్మజమ్మ గారు

అప్రస్తుత ప్రసంగం : ఎవరైనా

వేదిక: విప్రకవుల సమూహం
సమయం: సాయంత్రం 7 - 9 వరకు

సరస్వతి రామశర్మ :
అభినవ శుకపండితమా
యభిమతమునుముందుపెట్టియారాధనతో
సభలో ఎన్నగజూచిన..
విభవమ్ముగసార్వభౌమ వేదికనిదియే......

మన అవధాని బ్రహ్మ శ్రీ బాలముకుందశర్మ గారికి... వారి బిరుదులను పద్యంలో నా పరిజ్ఞానం మేరకు  ప్రకటిస్తూ... 🙏🙏🙏స్వాగతం

అవధాని గారు:
శ్రీ విళంబి ఫాల్గుణ శుద్ధ విదియ,
8-3-2019, శుక్రవారము.

ప్రార్థనా -- 🔔
ఛందము: *మౌక్తికమాల* (భతనగగ)
ప్రాస √  -- యతి 1-7.

శ్రీగిరిజా మాత శివసతీ వా
గ్యోగవిధాన ప్రగుణ వరం మే |
పూగఫలాప్తిన్వపుధృత విఘ్నే
డ్యోగ గణేశా పటుతర మేహి ||

జ్ఞానప్రసూనమ్మ: అవధాని గారికి నమస్కారం
అంశం;  నిషిద్దాక్షరి
ళ, త ,మ.    నిషిద్ధం.
సృష్టికి మూలమైన  *స్త్రీ* కి  ప్రత్యేకత  ఒక్కరోజు మాత్రమేనా ? యిది ఎంత వరకు. సబబు.
స్వేచ్ఛా ఛందస్సు లో


కొల్లూరి పద్మజ : ,🙏పెద్దలందరికీ నమస్సుమాంజలి🙏
అవధానాచార్యులకు మనవి. అవధాన క్రమంలో నా నుండి ఏమైనా పొరపాటు ఐతే మన్నించండి🙏
అంశం.      :  దత్తపది
పదాలు   :  చీర, రవిక, గాజులు,బొట్టు.
విషయం: పదాలను అన్యార్థంలో ఉపయోగించి  "మహిళలపై దాడులను నిరసిస్తూ వాటిని ఎదుర్కొనేలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ.. కవివరేణ్యులు తమ స్వేచ్ఛా ఛందస్సులో దత్తపదిని అందించ ప్రార్థన.

అవధాని గారు: ఆశువు :
భామలు కోమలత్వగుణ పావన భావన ధీవనాత్మ స
ద్యో•మల మానసాంబుజ నియుక్త వియుక్త సుధాక్త మాధురీ
శ్యామలతాతనూ విభవ యామినులై జగమందు కార్యసా
ధ్యామల చిత్తులైరి మనసా వచసా కవితాంజలిచ్చెదన్

గుమ్మనగారి బాల సరస్వతి : అవధాని గారికి అనేకానేక అభివాదాలు...🙏🙏🙏సమూహ సభ్యులు అందరికీ నమో వాకములు...🙏
అవధాని గారూ ..పై దృశ్యాన్ని చూసి,స్పందన తెలుపగలర ని కోరుతున్నాను..
ఛందస్సు:స్వేచ్ఛా వృత్తము.🙏

పద్మ చిగురాల : అవధాని గారికి ప్రణామాలు.🙏🏻
అంశం-
సమస్యాపూరణం..
"మగువా నీశక్తి చూసి
మాధవుడేడ్చెన్ "

చీదెళ్ళ సీతాలక్ష్మి: అవధాని గారికి నమస్కారం..
ఈరోజు న్యస్తాక్షరి లో....
అం .మొదటి పాదంలో మొదటి అక్షరం....
గ ..రెండవ పాదంలో 8 వ అక్షరం...
న..మూడవ పాదంలో  ..మూడవ అక్షరం...
లు..నాల్గవ పాదంలో  7 వ అక్షరం...ఆధునిక మహిళా శక్తిని  ఉత్పలమాలలో చెప్పండి.....

అవధాని గారు :
సన్నని మృదువగు కంఠ
స్వని పద్మజ రంగరాౙు భక్తియుతమ్మా
యనగ పురాణపఠనఁజే
సెను యవధానమ్మున వర శేముషి గరిమన్

లక్ష్మి మదన్ : వర్ణన
అవధాని గారూ! దేవతల కాలం లో నేమో ఆడవాళ్ళకే మొదటి స్థానం అన్నారు ....
ఆ తర్వాత మగవాళ్ళ రాజ్యమే నడిచింది ..నడుస్తుంది కూడా....మగ అహంకారం అనేది చాలా చోట్ల చూస్తున్నాము.....సమానత్వం అనే పేరు పెట్టారు ... కానీ ఏ రంగం లో చూసినా స్త్రీ ఎదుగుదలను ఓర్వడం లేదు పురుషులు...దీని పై ఘాటుగా సీస పద్యం లో స్పందించండి.

పద్మజా రంగరాజు : అయ్యా !!! నా వద్ద  పదాలు,  మాటలు  లేవు, చెప్పడానికి  నోరు పెగలడము  లేదు.... వందన శతము  సమర్పించుకుంటున్నాను

లక్ష్మీ మదన్ : అప్రస్తుతం
ఈరోజుల్లో మగ వారు వంటలు ఎప్పుడు చేశారని

అవధాని గారు: నిషిద్ధాక్షరి
నారీ పటుగుణ సంక
ల్పారాధన జగతి హితకరాభావనలే
వేరేదియు సరిరాదిక
యీరోౙొకటేసరియననేలా ఘనులన్

అవధాని గారు : సమస్యాపూరణం
సిగలో మల్లియమాలలు
నగవులమురిపాలు నడుమునందున వళులన్
దగ మోహినిగా విష్ణువు
మగువా! నీ శక్తిఁౙూసి మాధవుడేడ్చెన్

సరస్వతి రామశర్మ : అప్రస్తుతం
సీతాపతీ
తారాచంద్రులు
రధాకృష్ణులు
పార్వతీ పరమేశ్వరులు.
ఇలా ముందు పేర్లు కానీ
వీళ్ళంతా అలా పెట్టుకున్నారు
భార్యాబాదితులుకారుకదా
అప్రమత్తంగా🙏

అవధాని గారు : ఏ పరిస్థితుల్లోనైనా మారి మార్చే శక్తి స్త్రీ మూర్తులదే కదా!

సరస్వతి రామశర్మ : అప్రస్తుతం
పెళ్ళికి జాతకాలు కలవకపోతే సులభంగా అమ్మాయి పేరు మార్చండి అంటరు.సాధికారతెక్కడో?
మరెప్పుడైనా పెళ్ళి పిల్లవాడిని మార్చరే😄
అప్రస్తుతం

అవధాని గారు : దృశ్యం
ఒకచేతిలో బట్టలొకచేతిలో బుట్ట
నొకచేత పుస్తకమ్మొకట డబ్బు
ఒకచేతిలోపాలునొకచేతిలో నీళ్లు
నొకచేత పుస్తకమ్మునుధరించి
యొకచేతిలో గంటెనొకచేతనంతర
జాలమ్ముధరియింౘుశక్తిశాలి
ఒకౘోట కార్యసాధకురాలునిల్లాలు
నొకౘోటకస్తూరి యొకట కాళి

తల్లిపిల్లచెల్లి తానుగా లోకమం
దెల్ల జనులనెల్ల యుల్లమునను
ౘల్లనైనమనసువెల్లువగు నుడుల
మెదలు మహిళసాటి మెరుపు లేదు

అక ప్రత్యయము వ్యతిరేకార్థ బోధకము.
పుస్తె+అకము = పుస్తకము
ఇల్లాలు సంసారబంధము కొఱకు తన నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా సార్లు మెదులుతుంది.
అది ఒక అర్థము.

అవధాని గారు : దత్తపది
అవధాని గారు :
ఎట్టులనీయగా ౙులుమనేకులుఁ
జీరగ వారిఁబొట్టుని
ప్పట్టులనేమి మారవిక భద్రముగా పయనింౘ లోకమం
దిట్టులనే దిగాలున కుదేలగుటేలనొ మారు పిల్లలన్
గట్టుగఁబెంౘుడి జగమ్మున కొమ్మలనమ్మ నమ్ముడీ!

సరస్వతి రామశర్మ : అప్రస్తుతం
షీ టీం కు హీ టీం ఎదురైతే

అవధాని గారు : హి కి మేలు.
ఎందుకంటే, Sheలో He ఉన్నాడు. Heలో She  S అంటేనే ఉంటాడు.

కొల్లూరు పద్మజ : చాలా చక్కగా ఉత్పల మాలను అందించారు. ఆర్యా! ధన్యవాదాలు

సరస్వతి రామశర్మ : అప్రస్తుతం
సత్యభామ..లక్షణాలలో
వారసత్వగా .....
మేం ఏవేవి అలవరచుకుంటే బాగుంటుంది అంటారు🤔🤔

అవధాని గారు : ఇంక క్రొత్తగా రావాల్సిన వేరైనా ఉంటే అవి సత్యభామకే.

సరస్వతి రామశర్మ : అవధాని గారికి
నేటి
🙏ఆశువు🙏
మహి
మహిళ పోలిక
 ఛందస్సు మీ ఇష్టం🙏

అవధాని గారు : అంత్యాక్షరి, అశువు
మేనును తిత్తిఁజేసితిని మేదినిపైఁ జరియింౘు జీవక
ల్యాణముకై సుకన్యగను రమ్యవికాస మనోవిలాస సౌ
ధాన చరింపనెంచియును సత్య కుటుంబ నిబద్ధ ధర్మ స
ద్యానముఁసేయఁబూనితిని ధర్మపథమ్మున గౌరవింౘుడీ

అవధాని గారు : వర్ణన
కోమలత్వమెగాని కోపగింౘడమేల
యనువారలింతైన కనరు మమ్ము
ఆలస్యమనుటేలనాహార్యమందున
నొళ్ళుదాౘుకొనని కుళ్ళు మీది
పంటలో వంటలో పడకలో పొదుపులో
సాటి మాకెవరండి ౘక్కదిద్ద
యుద్యోగముల్లాస సద్యోగ సల్లాప
సమర దౌత్య సహనశాలి మహిళ

అౘ్చులేరీతి హల్లులకాకరమ్ము
నన్నమేవిధికూరలకాస్పదమ్ము
నట్టులేస్త్రీలు సుగతికినాదరమ్ము
మహిళ గుణధీర వరభూష మాన్య రూప

సరస్వతి రామశర్మ :
పథకముపొందెనుకౌళిని
రథముననేతెంచినంతరాజిలుమదిలో
కథనముయేమనిజెప్ప శ్రీ
పథ,పుత్రికనుగనినయాపావని మురిసెన్


అవధాని గారు : న్యస్తాక్షరి
అండగనుండి నిండుమనమండగ
మెండగు ధైర్యమిౘ్చుౘున్
బండెడు చాకిరీ  వగవు పాటున మేటిగఁజేయు రండలన్
గుండెనఁజీల్చు ముండనముఁ గోరును శాస్త్ర కవిత్వ చిత్ర స
న్మండన మూర్తులీయతివనాదర భావనలన్నుతింపుడీ

అవధాని గారు : ఛందోభాషణం
అబలలమని మనసులగని
సొబగులు సోయగములంచు సూక్తలు సుదతుల్
కబురులకే పరిమితమై
సబలత్వము మరచిరేల సారస నేత్రా


సింగీతం నరసింహారావు : పథకముననుసారము పథమునెంచుకొనిపథకముపొందెను. ప్రృచ్ఛక సోదరీమణుల అవధాన ప్రక్రియానంతరం  ఇంకాఏమైనా....ఎవరైనా కంటె ముందు చి "కౌముది ఉన్నతశ్రేణికి మహిళా దినోత్సవము రోజున లభించిన పథకం ను చూసి మురిసిన మాత్రృ మూర్తి ఆనందాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పండి.మాకోసంమాత్రమే ...(ఇది అవధానం లో లెక్క...విషయంలో ఉమ్మడి సమన్వయ కర్తలదే)

అవధాని గారు :
ఎంతోకొంత ముదంబునెంత గరిమన్నేనాటికైనన్మనో
స్వాంతశ్చేతననొందె తల్లి గద! నా హాకింగనే స్టీఫెనున్
సొంతంబైన యశోవిశారదుడికై చోద్యమ్మిదే రుక్మిణీ
కాంతక్రాంత ముదాంత శాంత వివరంగా కౌళినీ జేతగాన్

అవధాని గారు:
అందరి కందరు నందరు
కొందరి కందుదురు కొంత కొందరనుకొనన్
ముందర తొందర నందరి
నందెదరీయబలలెల్ల యభినందనలున్

స్వస్తి

Monday, May 20, 2019

నిత్యావధానం 103 వ రోజు, శతచ్ఛంద గణాధిపమ్ ఆవిష్కరణ

నిత్యావధానం
103 వ రోజు
శతచ్ఛంద గణాధిపమ్ పుస్తకావిష్కరణ

అభినవ శుకపండితుడు, సమన్వయ సార్వభౌమ
బ్రహ్మశ్రీ గౌరీభట్ల బాలముకుంద శర్మ గారిచే

103 వ నిత్యష్టావధానం

తేదీ 12-5-2019, ఆదివారం,
NBT హాల్ ఆంధ్రమహిళాసభ
ఉస్మానియా యూనివర్సిటీ
లో..
🌹శతఛ్చందగణాధిపం.🌹.
పుస్తకావిష్కరణ శ్రీ దోర్భల విశ్వనాథశాస్త్రి గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా.. సాగింది.

పుస్తక రూపకల్ప‌న :
శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

31-01-2019 నుండి 11-05-20109
వరకూ కొనసాగిన వాట్సాప్ అవధానాలలో సమన్వయకర్తగా.   సముహ నిర్మాణకర్తగా..
గోగులపాటివారి కృషి తో
12-05-2019 ఆదివారం
సాయంత్రం 6గంటల 8-30 ని ...
శ్రీ ముత్యంపేట గౌరీశంకరశర్మ గారి సమన్వయంలో...
శ్రీ డా.చెప్పెల హరినాథ్ శర్మగారి సభాధ్యక్షతన...
ముఖ్యాధ్యక్షులు.. బ్రహ్మశ్రీ దోర్భలవిశ్వనాథశర్మగారు...
ఆత్మీయ అతిథులుగా బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారు,  మరుమాముల వెంకటరమణ శర్మ గారు, అవధానులు శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు, తదితరుల సమక్షంలో జరిగిన ప్రత్యక్ష అవధానం విశేషాలు...

🌹🙏🌹🙏🌹

ఆరంభంలో గణపతి స్తుతి
ఛందము::ఉజ్వల
న  న భ ర .గణాలు
యతి...1-8   ప్రాస...ఉంది
      గణపతిప్రార్థన
🔔🔔🔔🔔🔔
జయగజవరదాస్యనమోస్తువి
స్మయకరభయనాశ జయోస్తుని
ర్ణయగుణధవళాప్తవధానసం
జయపదపథ వాసగతిర్విధే

🌹🙏🌹🙏🌹🌹🌹
1వ అంశం:: వర్ణన

గుళ్ళపల్లి. తిరుమల కాంతికృష్ణ గారు
వాట్సాప్ వంద అవధానాలు దాటిన అనుభవం స్వేచ్చా ఛందస్సు లో

దూరవాణిగాంచదోషమ్ములనియెడి
భావనమ్మునుపోద్రోలె పావనముగ
వందయవధానములుగోరిబాపలెల్ల
దూరవిద్యలుగలిపిరితూర్ణగతుల
🙏🌹🌹🙏🌹🌹🌹
 2వ అంశం:::దత్తపది
వేదాంతం సురేష్ బాబు గారు
సస్త్  , మస్త్ , వ్యస్త్  ,త్రస్త్
అమ్మవారి స్తుతి
కందములో

స్వస్త్వనెడిసమస్త భయమును
త్రస్తముగావ్యస్తజీవలాస్యమ్మనగా
విస్తరమౌనీరూపము
శస్తముగాగాంచనిమ్ము శంభునిరాణీ!
🌹🙏🌹🙏🌹🌹🌹
3వ అంశం::సమస్యాపూరణం

అష్టకాల విద్యాచరణ్ గారు

వీరము స్ర్తీ కిశోభయని వేదములెల్ల నుతించి చెప్పనో

మారకుమారధీరవర మాన్యవరేణ్యగుణానుగమ్యసం
ధ్యారమణీయకాంతులముదావహరీతిగ నందబాలప
ద్మారుచిరప్రదమైనమానవజీవనపావనాత్మసౌ
వీరము స్త్రీకిశోభయనివేదములెల్లనుతించిచెప్పనో...
🌹🙏🌹🙏🌹🌹🌹🌹
4వ అంశం::: నిషిధ్ధాక్షరి

మంచినీళ్ళసరస్వతీరామశర్మ(త్రిగుళ్ళ)

ఇచ్చాశక్తి‌ ,జ్ఞానశక్తి‌ ,క్రియాశక్తి....
స్తుతి...
కందములో..

సమకరి శార్వరిభామిని
హిమగధిపా లక్ష్మి ధాతృ హీరగుణాఢ్యా
దమగతి శక్తి విధాయిని
క్రమముద్విదశక్తి నీవు రజనినిభాస్యా!

నిషిధ్ధాక్షరాలు
ర,  ప  శ  మ  ద  వ స 
జ  ణ. త.  ర.  స. వ   వ  క  ద  🌹🙏🌹🙏🌹🌹🌹

5వ అంశం::ఆద్యంత్యక్షరీ

జ్ఞాన ప్రసూనశర్మగారు/సింగీతం సంధ్యారాణి గారు

కమనీయరమణీయ.కవితలుజెప్పనా నన్నయమాయింట......మధురకవులెందరెందరొమసలినారుతెలుగుసాహిత్యరంమందిరమునందు

ద ఆద్యక్షరంతో

దానవచక్రవర్తిబలిదానముదానముజీవకోటిక
ళ్యాణముకైదధీచిసురయాచితదేహవిముక్తికైనిజ
ప్రాణముధారవోసినవిరాగమురాగముదానశేముషీ
జ్ఞానసరస్వతీసలిలజాతముఖాంచిత. వాగధీశ్వరీ

రెండో ఆద్యంత్యక్షరీ... లో
అమ్మలేకనెకదా...
రేఫము చివరరాగా..

రాణివిసత్కవిత్వకులరాణివి దాతృసహృద్విరాజ పా
రాణివిపండితాశ్రితవిరాజితశాస్త్రకళాసుధీవిలా
సానివివాక్సుధావిభవశాలినివీవునతుల్విశారదా
జ్ఞానసరస్వతీసలిలజాతముఖాంచితవాగధీశ్వరీ!


🌹🙏🌹🙏🌹🌹🌹

6వ అంశం:::ఛందోభాషణం
అమరవాది రాదశేఖరశర్మగారు

1   గోలోకాశ్రమవాసమేట్లు గలిగెన్ కోరంగసంసారికిన్

అవధానిగారు

ఆలోకింపగ జీవమెట్లుగలిగెన్ ఆనందముప్పారగన్

రెండవ ఛందోభాషణం

పద్యము పథ్యమెవ్వరికి......
అవధానిగారు
 భావనసేయగ మానవోత్తమా...
🌹🙏🌹🙏🌹🙏
7వ.అంశం::ఆకాశపురాణం
పద్మజారంగరాజు గారు

ఏదిధర్మంఏదిఅధర్మం
వేదోఖిలోధర్మమూలం
వృక్షో రక్షతి రక్షితః
కాపడబడిన చెట్టు మనల కాపాడుతుంది
బృహద్గారుడపురాణంలో
వ్యాసనారాయణులు. ధర్మ దృఢబద్ద మూలహః. వేదస్కందః పురాణాఖ్యాఢః
క్రతుకుసుమోక్షఫలో మధుసుదనపాదపోజయతి!!

అని ధర్మానికి వృక్షానికీ అభేదంగా పేర్కోన్నారు ..
అందుకే..
ధర్మో రక్షతి రక్షితః
వృక్షోరక్షతిరక్షితః ..ఆను వాక్యాలు ప్రసిద్ధ మైనాయి
     
🙏🌹🙏🌹🙏🌹
8వ అంశం::అప్రస్తుతం
మల్లావఝల చంద్రశేఖర శర్మగారు
నందబాలశర్మగారు..సమయస్ఫూర్తి తో..సామాజిక ఆధ్యాత్మిక పరమైన అప్రస్తుతాలతో సభను అలరించారు.

ప్రముఖులు... పండితులు.. వాట్సాప్ వేదికగా102రోజులు గా కొనసాగిన పృచ్చకగణం.
కవిమిత్రులు.బంధువులు
అందరి సమక్షంలో... పండితపామర జన రంజకంగా కొనసాగిన
103.వ ప్రత్యక్ష అష్టావధానం....🙏🌹🙏🌹🌹సేకరణ
త్రిగుళ్ళసరస్వతీ రామశర్మ(మంచినీళ్ళ )
🙏🌹🙏🌹🙏





Saturday, May 18, 2019

నిత్యావధానం వాట్సప్ వేదికగా 108వ రోజు

వాట్సప్ వేదికగా అష్టావధానం
18-052019. శనివారం
108 వ రోజు

విప్రకవులందరికీ స్వాగతం
అవధానులు..
బ్రహ్మశ్రీ ఆయాచితం నటేశ్వరశర్మగారు.

సమన్వయ కర్త : గోగులపాటి కృష్ణమోహన్ గారు

అతిథులు
బ్రహ్మశ్రీ చెప్పెల్ల హరినాథ శర్మ గారు
బ్రహ్మశ్రీ గౌరీభట్ల బాలముకుంద శర్మ గారు
బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు
బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

పృచ్ఛకులు

చందోభాషణం : మాడుగుల మురళీధర శర్మ గారు

నిషిద్ధాక్షరి : గోగులపాటి కృష్ణమోహన్ గారు

సమస్య: సరస్వతి రామశర్మ గారు

దత్తపది : రామక కృష్ణమూర్తి గారు

ఆశువు : మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ గారు

వర్ణన :సింగీతం నరసింహారావు గారు

దృశ్యం :వేదాంతం సురేష్ బాబు గారు

అప్రస్తుత ప్రసంగం : ఎవరైనా

వేదిక: విప్రకవుల సమూహం

ప్రార్థన !
🍁🍁
కవులను మించిన కవియై
భువి కవులకు నడ్డులేని పూర్ణత నిడుచున్
కవనపు లక్ష్యము నొసగెడి
కవిగణపతి గొల్తు నిత్యకవనస్థితికై!

ఆశువు:
తిరుమల వెంకటేశ్వరస్వామి గూర్చి

పూరణ
తిరుమల వేంకటేశ్వరుడు దివ్యమనోజ్ఞకవిత్వమూర్తియై
పరిమళమొప్పు భావనలనపారముగా వెదజల్లి యీ సభన్
నిరుపమసాహితీవిభవనిత్యవసంతమొనర్చుగాక నన్
కరుణను బ్రోచుగాక సువికాసవిలాసకళాస్వరూపియై !


దత్తపది
మార,ధీర,పార,చోర-దత్తపదములు ప్రాస స్థానమున వచ్చునట్లు ,బుద్ధజయంతిని చెప్పగలరు

పూరణ
మారకుండిన జగతిని మార్చు కొరకు
ధీరవర్ధిత తపమున దీక్ష బూని
పారమును జూపె బుద్దుడు ప్రబలరీతి
చోరహార్యము గానట్టి శుద్ధవాణి!


ఆశువు:
అవధాని గారికి నమస్కారములు!

పుస్తక ఆవిష్కరణ సభల గురించి ...పుస్తక సమీక్ష ల గురించి ఆశువుగా చెప్పమని మనవి.

పూరణ:
పుస్తకమస్తకమ్ము గని పూర్ణత నిండగ దానిలోని స
ద్వస్తుతతిన్ గనుచువాక్యత దెల్పిన మేలుగాని నే
డస్తవనీయమో విధిని హాసముగా కొనసాగు నౌచితీ
ప్రస్తుతి లేక నీ తెరగు వాంఛితమౌనె   కవీంద్రకోటికిన్?

వర్ణన:
14సంవత్సరాలవనవాసఅనంతరం అయోధ్యకు సీత,శ్రీరాములవారులు.... తోపాటు తిరిగివచ్చిన లక్ష్మణుడు తన ధర్మపత్ని ఆనాటి నుండి తాను వచ్చువరకు నిద్రలో ఉన్న ఊర్మిళను నేనొచ్చాను,లెమ్మని అంటున్న సందర్భమును పద్యంలో వర్ణించి మనవి. ఉత్పలమాల ఛందము.

పూరణ
రామపథానువర్తినయి రాజితరీతి వనప్రవాసినై
నేముము పూర్తిజేసితిని నిర్మలమాయె మనంబు నేటికిన్
శ్రీమతివైన నీవు సహశీలత నిద్రను జారుకొంటివే
కోమలి!లెమ్ము నిద్ర విడి కోసలనాథు నమస్కరింపుమా!


సమస్య
శాపమువరమైనవేళ సారస్వతికిన్

పూరణ
కోపము తాపము శాపము
తాపసుల వచస్సులందు తాపహరములౌ
ఖ్యాపితధర్మపు త్రోవల
శాపము వరమైన వేళ సారస్వతికిన్ !



దృశ్యం:
మా చెన్నూరు గ్రామము నేటి మంచిర్యాల జిల్లాలో ఉంది. అగస్త్య మహాముని ద్వారా ప్రతిష్ఠతమైన ఈ శివలింగం చాలా పురాతనమైనది మరియు మహిమాన్వితమైనది.ఈ ఆలయంలో దాదాపుగా 400 సంవత్సరాల నుండి అఖండదీపం వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నది. ఈ స్వామి అంబాఅగస్త్యేశ్వర స్వామిగా ప్రసిద్ధి గాంచాడు. ఈ స్వామివారిని " అంబాఅగస్త్యేశ్వరా" మకుటంతో కీర్తించగా గురువర్యులకు నమస్కారపూర్వక విజ్ఞప్తి.

పూరణ
ధర చెన్నూరున వెల్గుచున్నది సనాతన్య ప్రభా రాశియై
వరదేవాలయమందఖండరుచితో భద్రమ్ముగా దీపమే
వరకుంభోద్భవసుప్రతిష్ఠిత మహాభాలింగరూపాన నో
హర! మా తాపము బాప రమ్ము! గిరిశా!అంబా అగస్త్యేశ్వరా!


నిషిధ్ధాక్షరి
గ గుణింతం నిషేధం తో
గంగా స్తుతి
స్వేచ్చా వృత్తంలో

పూరణ:
వెన్నుని పదమున బుట్టుచు
తిన్నల  తారల పథమ్ము దీరె త్రిపథయై
వెన్నెలవోలిక వాలెను
తన్నుచు పాపములనెల్ల ధరణిని బ్రోవన్!



ఛందోభాషణ: 1
అవధానాష్టోత్తరశత
కవనమ్ములు సాగుగాక కమ్రతరోక్తిన్
భువి సాగు వర్ణనమ్మున
భవనము భావనముగాదె?భావింపంగన్ !

ఛందోభాషణ: 2
భవుడేయీయవధాననాట్యమునతాభాషించుఛందమ్మునన్! 
శివుడే నేనయి నాట్యమాడుదు గదా చిల్లాస్య సంవాసినై !
కవిగామీరిటబృందసభ్యులగుమాకాశీస్సులందించగా!
సవనంబాయెను సాహితీవనమునన్ స్వారస్యమేపారగా!

ఛందోభాషణ: 3
పూర్ణతనొందగా కవులు భూషణభాషణమందజేరసం!
పూర్ణతరమ్మునౌ బ్రతుకు పూసిన పూవుగ విచ్చుకొన్నచో!
కర్ణపిశాచమాంద్యతలు*గ్రక్కునవీడగ సాహితీక్రియల్!
కర్ణరసాయనమ్ములుగ గావలె నిత్యము పద్యధారచే!

ఛందోభాషణ: 4
ధన్యముమీదుభాషణసు*ధారరసార్ణవధారపారగా!
సాధనతోడ సాధ్యమగు సర్వము నీ జగతిన్ కవీశ్వరా! ధారణచేయలేకమది*దాగుడుమూతలునాడుచుండగసం!
అన్యులకేలదక్కునిధి*నందినవారికిమాత్రమేసుమా! 
పల్కుల చిల్కలున్నవిట భాషణ సేయగ దాపదేలనో ?
మాన్యము పద్యవిద్య జనమాన్యము గాదె సమస్తవేళలన్!
నూరవధానముల్ గనిన నూతనుడౌ నవధాని పుట్టడే?
పలుకుడు కొత్తమాటలను పాటలుగా ననునిత్యమాటతో!
ధారణధోరణుల్ నిరతధారయు ధైర్యము నిల్పునెప్పుడున్!
ధారణ సాధ్యమౌను గతధారను వీడక సాగిపోవగన్!


సమాపణ
సమాపనపద్యం:

తీర్చె గదా వధానమును దివ్యసరస్వతి నన్ను గాచుచున్
కూర్చిన పద్యమాలికను
కోమలితమ్ముగ వేతు మాలగా
మార్చును సత్కవిత్వము సమమ్ముగ నెల్ల ధరిత్రి జీవులన్
చేర్చును శాంతిసౌఖ్యముల చిన్మయభావతరంగరంగయై!

అందరికీ స్వస్తి!

మీ

అయాచితం నటేశ్వరశర్మ.


కృతజ్ఙత
🙏🌹🙏🌹🙏

కార్యముసఫలముజేయగ
పర్యాయముగద్వితీయ  భంగములేకన్.
ఆర్యులునటేశ్వరసుకవి
వర్యులుయవధానసభను వాణీకృపచే
🙏🌹🙏🌹🙏

స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయ కర్త




Saturday, March 30, 2019

అష్టావధానం - మొదటి రోజు 31-01-2019

అష్టావధానం - మొదటి రోజు
31-01-2019

వేదిక: విప్రకవుల సమూహం (వాట్సప్ వేదిక)

విప్రకవులందరికీ స్వాగతం

అవధాని శ్రీ గౌరీబట్ల బాలముకుంద శర్మ గారు

సమన్వయ కర్త :గోగులపాటి కృష్ణమోహన్

పృచ్ఛకులు
చందోభాషనం : మాడుగుల మురళీధర్ శర్మ గారు
నిషిద్ధాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్ గారు
సమస్య : గోగులపాటి కృష్ణమోహన్ గారు
దత్తపది : మల్లావఝ్ఝుల చంద్రశేఖర్ శర్మ గారు
న్యస్థాక్షరి : సరస్వతి  రామశర్మ గారు
అంత్యాద్యక్షరి : బాలసుజాత గారు
అప్రస్తుత ప్రసంగం: మల్లావఝ్ఝుల చంద్రశేఖర్ శర్మ గారు, గోగులపాటి కృష్ణమోహన్ గారు

ప్రార్థనా --
ఏనాడైనను నిన్నుఁజేరుటనగానే నేను ముందుండ న
న్నానాడే పడద్రోయకుండ జననీ నానాటికిన్నీకృపన్
స్వానందమ్ముగఁగూర్చితీవు వరవాగ్వాణీ భవత్సౌహృదా
స్థానీయమ్మగు పాలఁబాలొసగి నన్ ధన్యాత్ముగాఁజేయు మా

సమస్య : గోగులపాటి కృష్ణమోహన్

అవధాని పూరణ
పలుకుల రాణీ వాణీ
తెలివిడిలో నిలిచి ధోవతీ శిఖ విద్యా
తలపుల నిలువు ప్రణతులు
విలువలు కోల్పోవుతున్న విప్రులఁగావన్

దత్తపది :మల్లవఝలచంద్రశేఖర్

మనస్విని
మానవతి
మహేశి
మంగళాకృతి
పదాలుపయోగిస్తూ
భారతజాతీయపతాకాన్నివర్ణించండి

అవధాని పూరణ
కాషాయమ్మన మంగళాకృతి మహాగంగాప్రవాహోద్ధృత
మ్మాషామాషియె? ధౌతవర్ణము సుధా మాహేశి సన్మానవ
త్యేషాపర్ణ సువర్ణ సస్య సుమనస్విన్యుత్తమా భారతీ
యైషోత్సాహ పతాకమంబరమునందాహార్యమై వెల్గెడిన్

అంత్యాదక్షరి : బాల సుజాత
చివరి అక్షరం రాజేశ్వరీ...

అవధాని పూరణ
రక్షణ జీవితమ్మునకు రాబడిలోన దశాంశదానమున్
భిక్షము వేయరే మనకుబేరులు
నార్తులకాదరమ్మునన్
భిక్షువునాదరించిన సుభిక్షమొసంగును భిక్షుకేశుడున్
లక్షణమైన కార్యము విలాసములందున మర్వఁబోకుడీ

అప్రస్తుతం
అయ్యా వాట్సప్ వ్యవహారానికి
ముఖాలుచూస్తూమాట్లాడ్డానికి
తేడాఉందంటారా

అవధాని
వాట్సప్ (what's అప్పు అంటే ముఖం చాటేయాల్సిందే

న్యస్థాక్షరి : సరస్వతి  రామశర్మ గారు
బాలముకుందం అన్నయ్య కు
వి....1వపదంలో మెదటి అక్షరం
నా..2వపాదంలో నాలుగవ అక్షరం
య .....3వ పాదంలో చివరి అక్షరం
కా!!!!!4వపాదంలో ఐదోఅక్షరం..
చందము...కందములో ...
శివరాత్రి వైభవం గురించి

అవధాని పూరణ
[ (వి)ధుమౌళి గరళ గళమే
బుధగా(నా)నందకరము సుబోధక శివరా
త్ర్యధిగత ముపవాసము మ(య)
మధుకర (కా)ర్పణ్య రహితమయ్యా శంభో!

జైవిఘ్నేశ్వర భగవా
నే విఘ్నములజ్ఞజనులనేమనకుండన్
గావంగా గతినీవే
నోవిజ్ఞ గుణజ్ఞ యజ్ఞ! ఔంప్రథమేశా!

జైవిఘ్నేశ్వర భగవా
నే విఘ్నములజ్ఞజనులనేమనకుండన్
గావంగా గతినీవే
నోవిజ్ఞ గుణజ్ఞ యజ్ఞ! ఓం ప్రథమేశా!

గోగులపాటి కృష్ణమోహన్: నిషిద్ధాక్షరి 
శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పండి
అదీ కందములో అయితే మరింత అందము సుమండీ

అవధాని పూరణ
గిరిజాపతి! ఢమరుకకర!
గరళగళ వినీలకంఠ గజచర్మధరా!
వరవరదాభయ గిరిధర
కరుణాళూ కాలకాల కంధరనాగా!

మల్లావఝ్ఝుల :అప్రస్తుతం
అమ్మ ఆవిడ విషయంచెప్పండి

అవధాని
ఆవిడయ్యాక అమ్మ అయింది

మాడుగుల మురళీధరశర్మ

బాలముకుందులప్రతిభలు
కాలోచితపద్యధార*
కమనీయముగా!
ఆలోచితపుసులోచన
మేలానుతియింపతరమె*
యీవేళందున్!
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట

కాలోచితావధానులు
ఆలాపనగాసుధార*
యావిష్కృతమౌ!
మీలీల లెరుగలేమా?
ఫాలాంశమునిండువాణి*
బాలముకుందున్!
మాముశ

అవధానముమొదలిడుమా
కవిరాజసుపూజ్యబ్రహ్మ* కందముతోడన్!
నవవిధపవధానముగా
సవినయముగకోరువాడ* సారమతీంద్రా!
మాముశ

ఈ కందము మాకందము
మీకందమమందమందమే పూరణమం
దేకొందుము సరసములను
చేకొందురె! పద్యముల వశీకరణముగాన్

ఛందోబాషణం మామూశ వాముశ

ఎక్కడచిక్కినారొగద?*
యేమియు పల్కకనూరుకుంటిరే?

మాముశ
[ మక్కువలెక్కువయ్యెను సుమా!

[ మరిమీరవధానమేర్చరే?
మాముశ

బాముశ
తక్కిన వారలెల్లనవధాన విధాన సుధాకవిత్వమం
దెక్కువ పద్దెముల్

గోగులపాటి కృష్ణమోహన్: అప్రస్తుతం

ఏమి నూరుకుంటున్నారో ఈ రాత్రి
అవధాని: ఈరోజు సుఫలైకాదశి. నూరుకునేదేమీలేదు. ఇదివరకే అరిగింది

[మాముశ: నుడువు* తీరును గాంచగ
వేచినారహో!
[ చక్కనిమొక్కవోలె?
[అవధాని : సన సన్నని
[మాముశ: సారరసాత్మసారముల్!
[అవధాని: దక్కినౘాలునా!
[మాముశ:  హృదయధామసుసంస్కృతి
[అవధాని: లక్షణాత్మ
[మాముశ :యౌ
[అవధాని : పెక్కు విధాల
[మానుశ: పేర్మిగొని ప్రేర
[అవధాని: ణగా వెలుగొందుచీయెడన్
[మాముశ: చక్కనిపద్యరాజమును
అవధాని: సాగిలఁజేసిన వాణి సన్నుతుల్
[మాముశ : ధన్యవాదములు....

.
ఛందోభాషణము
ఉత్లమాల:
ఎక్కడచిక్కినారొగద?*యేమియు పల్కకనూరుకుంటిరే?
మక్కువలెక్కువయ్యెను సుమా!
మరిమీరవధానమేర్చరే?
తక్కిన వారలెల్లనవధాన విధాన సుధాకవిత్వమం
దెక్కువ పద్దెముల్ నుడువు* తీరును గాంచగ వేచినారహో
చక్కనిమొక్కవోలె? సన సన్నని సారరసాత్మసారముల్!
దక్కినౘాలునా హృదయధామసుసంస్కృతి లక్షణాత్మయౌ
పెక్కు విధాల పేర్మిగొని ప్రేరణగా వెలుగొందుచీయెడన్
చక్కనిపద్యరాజమును సాగిలఁజేసిన వాణి సన్నుతుల్

స్వస్తి